టీజీఎన్పీడీసీఎల్ కు ‘ఇన్నోవేషన్ విత్ ఇంపాక్ట్’ అవార్డు
హైదరాబాద్ : డిస్కమ్‌ల కోసం ఇచ్చే 14వ ‘ఇన్నోవేషన్ విత్ ఇంపాక్ట్’ అవార్డును టీజీఎన్పీడీసీఎల్ కైవసం చేసుకుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, వినూత్న కార్యక్రమాలను అవలంబించి నందుకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. వినియోగదారులకు అందించే విద్యుత్ పంపిణీ సేవల నాణ్యత, విశ్వసనీయత, సామర్థ్యాన్ని మెరుగు పరచడానికి చేపట్టిన వినూత్న కార్యక్రమాలకు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించినందుకు గుర్తింపుగా తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎన్పీడీసీఎల్)కు డిస్కామ్‌ల కోసం ఇచ్చే 14వ ‘ఇన్నోవేషన్ విత్ ఇంపాక్ట్’ అవార్డును ప్రదానం చేశారు.
న్యూఢిల్లీలో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) నిర్వహించిన 20వ ఇండియా ఎనర్జీ సమ్మిట్‌లో భాగంగా జరిగిన డిస్కామ్‌ల కోసం 14వ ‘ఇన్నోవేషన్ విత్ ఇంపాక్ట్’ అవార్డుల కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. టీజీఎన్పీడీసీఎల్ తరఫున కంపెనీ సెక్రటరీ కె. వెంకటేశం ఈ అవార్డును స్వీకరించారు. శనివారం హనుమకొండ జిల్లా నక్కలగుట్టలోని కంపెనీ కార్పొరేట్ ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్లు వి. మోహన్ రావు, వి. తిరుపతి రెడ్డి, టి. మధుసూదన్, సి. ప్రభాకర్లతో పాటు కంపెనీ కార్యదర్శి కె. వెంకటేశం సమక్షంలో టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డికి ఈ అవార్డును ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన, నమ్మకమైన ,నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించడానికి టీజీఎన్పీడీసీఎల్ తన పంపిణీ నెట్వర్క్ అంతటా అధునాతన సాంకేతికతలను విస్తృతంగా అవలంబిస్తోందని , అనేక వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమాలలో భాగంగా విద్యుత్ ఫీడర్లను నిజ సమయంలో పర్యవేక్షించడానికి కంపెనీ రియల్-టైమ్ ఫీడర్ మానిటరింగ్ సిస్టమ్ (RTFMS)ను విస్తృతంగా అమలు చేస్తోందని చెప్పారు.