సామరస్య వాతావరణం చెడగొట్టాలని వైసీపీ కుట్ర
అమరావతి : శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఏ ఒక్కరిని కూటమి ప్రభుత్వం వదిలి పెట్టబోదని హెచ్చరించారు అని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర. వైసీపీ నాయకులు చేస్తున్న పిల్ల చేష్టలు, కుర్ర చేష్టలు, కుంక చేష్టలు ఇక మీదట ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ నామినేషన్ల ప్రక్రియలో వైసీపీ చేస్తున్న అరాచకాలపై శనివారం సాయంత్రం జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజలతో ఎన్నుకోబడ్డ ఎంపీ కనీస ఎన్నికల నిబంధనలు పాటించకుండా, రాజ్యాంగం పట్ల గౌరవం లేకుండా ప్రవర్తించడం అత్యంత హేయనీయమని పేర్కొన్నారు. ఎన్నికల నామినేషన్ వేయడానికి నిబంధనలకు విరుద్ధంగా 100 మందితో నామినేషన్ వేసే కేంద్రంలోకి ప్రవేశించాలి అనుకోవడం దారుణం అన్నారు.
ఎంపీకి కనీసం నిబంధనలు తెలియవా? కావాలని అలా చేశారా..? అనేది సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సామరస్య, స్వేచ్ఛయుత వాతావరణాన్ని చెడగొట్టడానికి వైసీపీ నాయకులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు రాయలసీమను ప్రతిసారి వెనక్కు నెట్టి వేయాలని చూస్తున్నారని వాపోయారు. స్థానిక ఎన్నికల్లో అధికారం అంటే బడుగులకు, అణగారిన వర్గాలకు లభించే అధికారంగా భావించాలని అన్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సమాజంలో కిందిస్థాయి వర్గాలకు స్థానిక సంస్థల్లో రాజ్యాంగ బద్దంగా దక్కే అధికారాన్ని వైసీపీ వారికీ అందకుండా దూరం చేయాలనీ చూస్తోందని ఆరోపించారు. బడుగులకు అణగారిన వర్గాలకు అధికారం ఇవ్వడం వైసీపీకి ఇష్టం లేదన్నారు. ఈ కారణంగానే రాయలసీమలో అరాచకం సృష్టిస్తూ, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని అన్నారు.