newsseals.com

ఏపీలో కొన‌సాగుతున్న రాచ‌రిక పాల‌న : జ‌గ‌న్

October 18, 2026 · VijayaBhaskar

తాడేప‌ల్లిగూడెం : వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యానికి ఏమవుతోంది అని ప్ర‌శ్నించారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజ్యాంగం, చట్టబద్ధ పాలన అమలవుతున్నాయా? అన్న అనుమానం వ్య‌క్తం చేశారు జ‌గ‌న్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో త‌మ పార్టీకి చెందిన‌ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇది పూర్తిగా అప్రజాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు. త‌మ వారిని నామినేష‌న్లు వేయ‌కుండా కూట‌మికి చెందిన నేత‌లు అడ్డుకుంటున్నార‌ని ఆరోపించారు. దీనిపై తాము కోర్టులో తేల్చుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. దాడులు చేయ‌డం, బెదిరింపుల‌కు దిగ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఇలాగే జరగాలా? రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేస్తోంది? అది నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రతిపక్ష అభ్యర్థులకు రక్షణ కల్పించడంలో పోలీసులు ఎందుకు విఫలమవుతున్నారని నిల‌దీశారు. రాజంపేట ఎంపీ పి.వి. మిథున్ రెడ్డిపై జరిగిన దాడి ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోందని అన్నారు వైసీపీ బాస్. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులకు, అభ్యర్థులకు కనీసం రక్షణ లేదా? అని వాపోయారు. అభ్యర్థులను బెదిరిస్తూ, వారిపై దాడులు చేస్తుంటే ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా ఎలా జరుగుతాయి? అని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్రజాస్వామ్యం ప్ర‌మాదంలో ప‌డింద‌ని, దానిని కాపాడు కోవాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌న్నారు.

Related News