హైదరాబాద్ : భారతీయ ఆంగ్ల రచయిత్రి డాక్టర్ శిఖా భట్నాగర్ రచించిన ఆరవ పుస్తకం “జ్యోతిర్లింగాలు మరియు పద్దెనిమిది మహాశక్తి పీఠాల పౌరాణిక కథనాలు” ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగరేణి కంపెనీ అధికారి సుధాకర్, ప్రముఖ చర్మవ్యాధి నిపుణుడు ముఖేష్రాజ్ శ్రీవాస్తవ, విద్యావేత్త ప్రొఫెసర్ చేతన్ శ్రీవాస్తవ, ప్రముఖ సంఘ సేవకుడు, రక్తదాత యోగేష్రాజ్ శ్రీవాస్తవ హాజరయ్యారు. డాక్టర్ శిఖా భట్నాగర్ తాను రచించిన కవితను వినిపిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిజిటల్ తెరలకే పరిమితమవుతున్న యువతను పుస్తక పఠనం, రచన వైపు ఆకర్షించడంతో పాటు భారతీయ, సనాతన సంస్కృతిని పరిచయం చేయడమే తన లక్ష్యమని డాక్టర్ శిఖా భట్నాగర్ తెలిపారు.
నోషన్ ప్రెస్ ప్రచురించిన ఈ పుస్తకంలో పన్నెండు జ్యోతిర్లింగాల కథలు, వాటి మూలాలు, అలాగే ఆదిగురు శంకరాచార్యులు రచించిన స్తోత్రాల ఆధారంగా ప్రసిద్ధి చెందిన పద్దెనిమిది మహాశ క్తిపీఠాల విశేషాలను చిత్రాలతో సహా వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు డాక్టర్ శిఖా భట్నాగర్ రచనా శైలిని, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను యువతకు చేరువ చేసే ఆమె ప్రయత్నాన్ని ప్రశంసించారు. స్వాతి శ్రీవాస్తవ రచయిత్రిని పరిచయం చేశారు. ప్రముఖ పాత్రికేయుడు అతుల్ శ్రీవాస్తవ శివుడు, శివతత్వంపై తన ఆలోచనలను ప్రేక్షకులతో పంచుకున్నారు.





