హైదరాబాద్ : భారత సైన్యం చేపట్టే వివిధ నియామక ప్రక్రియలలో తెలంగాణ యువతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ , ఇతర సైనిక ప్రతినిధులతో కలిసి ‘భూమి పెవిలియన్’ వద్ద ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. సైనిక నియామకాలలో స్థానిక యువతకు విస్తృత అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఆసక్తి , అర్హత ఉన్న జిల్లా కేంద్రాలలో శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కోరారు. లెఫ్టినెంట్ జనరల్ అందుకు సానుకూలంగా స్పందించారు. దేశ వ్యాప్తంగా నిర్వహించే వివిధ సైనిక నియామక ప్రక్రియల కోసం తెలంగాణలోని సంబంధిత జిల్లా కేంద్రాలలో ముందుగానే శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
దేశంలో విపత్తు సమయాల్లో సైన్యం పోషించిన పాత్రను ముఖ్యమంత్రి అభినందించారు. రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస పనులలో సైనిక యంత్రాంగం మరింత చురుకుగా వ్యవహరించాలని సీఎం కోరారు. తెలంగాణలో విపత్తు పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రత్యేక చర్యలు చేపట్టేలా స్థానిక సైనిక అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని రాజేష్ పుష్కర్ తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా, చారిత్రక నగరమైన హైదరాబాద్కు పూర్వ వైభవాన్ని తీసుకు రావాలనే సంకల్పంతో ‘మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు’ను చేపట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని లెఫ్టినెంట్ జనరల్ అభినందించారు.





