వికారాబాద్ జిల్లా : సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో ఓట్ల తొలగింపునకు కేంద్రం కుట్రకు తెర లేపిందన్నారు. కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఓట్ల తొలగింపు కుట్రకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పాల్పడుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్లను తొలగించడం ద్వారా తెలంగాణలో తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని హెచ్చరించారు. మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓట్లను తొలగించడం ద్వారానే బీజేపీ విజయం సాధించిందని, ఇప్పుడు తెలంగాణలోనూ అదే మోసపూరిత విధానాన్ని అనుసరిస్తోందని సీఎం విమర్శించారు.
SIR ప్రక్రియలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓటర్లను బీజేపీ లక్ష్యంగా చేసుకోవడాన్ని సీఎం రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. తాము చూస్తూ ఊరుకోబోమని, కాంగ్రెస్ మద్దతుదారుల పేర్లను తొలగించే బీజేపీ చర్యలను అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇటువంటి ప్రయత్నాలను పార్టీ కార్యకర్తలు సహించరని అన్నారు. గత ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థులను ఓడించడానికి బీజేపీ ఈడీ (ED), సీబీఐ (CBI)లను దుర్వినియోగం చేసిందని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ఆ జాతీయ పార్టీ ఓట్ల తొలగింపు చర్యలకు దిగిందని పేర్కొన్నారు. చిన్న చిన్న లోపాలను సాకుగా చూపి ఓట్లను తొలగించడాన్ని సీఎం తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఓట్ల తొలగింపు విషయంలో బీఆర్‌ఎస్ (BRS) కూడా బీజేపీకి మద్దతు ఇస్తోందని ఆయన అన్నారు.
ఓటు హక్కును కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులందరిపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు. ప్రజల ఓట్లను రక్షించే బాధ్యతను స్వీకరించాలని ముఖ్యమంత్రి కీలక నాయకులకు పిలుపునిచ్చారు. పేదల ఓట్లు తొలగించ బడకుండా చూసేందుకు గ్రామ స్థాయిలో బూత్ స్థాయి ఏజెంట్లు (BLAs) సమన్వయంతో పనిచే యాలని సూచించారు. విచక్షణా రహితంగా ఓట్ల తొలగింపు జరగకుండా పర్యవేక్షించాల్సిన బాధ్యత మండల స్థాయి నాయకులపై కూడా ఉందని ఆయన పేర్కొన్నారు.





