హైదరాబాద్ : తన తండ్రి , మాజీ సీఎం కేసీఆర్ గురించి అత్యంత నీచంగా చావాలని కోరుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగా ఓడించడం మానేసి, వారికి మరణం కలగాలని కోరుకోవడం ఏమిటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రత్యర్థి నాయకులు, కులాలు , వ్యవస్థలను దూషించడానికి లేదా అసభ్య పదజాలం వాడటానికి ఇలాంటి భాషను ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు. ఇలాంటి నాయకుడిపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు? అంటే ఆయన చేసే దూషణలను కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తోందా? అని ప్రశ్నించారు కవిత.
అధికార పార్టీ నాయకులు ఒక దండయాత్ర చేసే సైన్యంలా ప్రతిపక్ష నాయకుడి ఇంటికి వెళ్లడం ఏమిటి? ముఖ్యమంత్రే స్వయంగా తన పార్టీ నాయకులను ఇలాంటి దాడికి ప్రేరేపించడం ఏ రకమైన చర్య? రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది? అని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు అందని విద్యార్థులు 22- ఏ గురించి నిషేధిత భూముల జాబితాలో తమ భూములు చేర్చబడిన రైతులు, ప్రజలు , ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడం, జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడం వల్ల ఉపాధి లేని యువత, యూరియా దొరకక ఇబ్బంది పడుతున్న రైతులు, GO 97 రద్దును కోరుతున్న పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు ఉన్నాయని అన్నారు. నిరంతరం జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాల వల్ల భయాందోళనల్లో బతుకుతున్న మహిళల గురించి పట్టించుకోక పోవడం శోచనీయమన్నారు.
నాణ్యమైన ఆహారం, వసతులు లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్న గురుకుల విద్యార్థులు. PRC అమలు మరియు పెండింగ్‌లో ఉన్న DAలతో సహా తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇలా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అధికార పార్టీ , ప్రధాన ప్రతిపక్ష పార్టీ గత రెండు రోజులుగా అసెంబ్లీ విలువైన సమయాన్ని వృథా చేశాయని ఆరోపించారు.





