హైదరాబాద్ : బ్యాంకులు, సేవా ప్రదాతలు , వివిధ సంఘాల ప్రతినిధులతో కూడిన ఒక ప్యానెల్ వ్యాపారులకు చేసే రూ. 2,000 పైబడిన యూపీఐ చెల్లింపులపై విధించాల్సిన ఛార్జీలపై త్వరలో ఒక నిర్ణయం తీసుకోనుంది. యూపీఐ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ , పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో సహా 22 మంది సభ్యులు ఉన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం స్వయం సమృద్ధి, మార్కెట్ విస్తరణతో సహా వివిధ అంశాల ఆధారంగా, రూ. 2,000 పైబడిన యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ గురించి కమిటీ త్వరలో నిర్ణయం తీసుకోనుంది.
వ్యక్తి నుండి వ్యాపారికి జరిగే రూ. 2,000 వరకు యూపీఐ లావాదేవీలు, రూపే డెబిట్ కార్డుల ద్వారా జరిగే వాటితో సహా ఉచితమని ప్రభుత్వం తెలిపింది. వ్యక్తి నుండి వ్యక్తికి జరిగే అన్ని UPI లావాదేవీలు కూడా ఉచితంగానే కొనసాగుతాయి.
సెప్టెంబర్ 14 నాటి గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, రూపే డెబిట్ కార్డ్ లేదా UPI లావాదేవీ ద్వారా రూ. 2,000 వరకు చెల్లింపు చేసే లేదా స్వీకరించే వ్యక్తిపై ఏ బ్యాంకు లేదా సిస్టమ్ ప్రొవైడర్ అయినా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎటువంటి ఛార్జీ విధించకూడదు. ఈ పరిణామంపై స్పందిస్తూ, ప్రతిపక్ష కాంగ్రెస్ మంగళవారం నాడు యూపీఐ లావాదేవీలపై ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌పై విమర్శలు గుప్పించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అటువంటి లావాదేవీలపై రుసుములు విధించడానికి నిశ్శబ్దంగా మార్గం సుగమం అయిందని పేర్కొంది. యూపీఐ , ఇతర నోటిఫైడ్ ఎలక్ట్రానిక్ చెల్లింపు పద్ధతుల ద్వారా జరిగే చెల్లింపులపై ఎం.డి.ఆర్. (MDR) విధించడానికి వీలు కల్పించే ఫ్రేమ్‌వర్క్‌ను అందించే పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007లోని సెక్షన్ 10 ఎకు చేసిన సవరణ తర్వాత ఈ నోటిఫికేషన్ జారీ చేయబడింది.








