సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
వరంగల్ జిల్లా : పేదవాడి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, పేదింటి ఆడబిడ్డ కుటుంబంలో చిరునవ్వు చూడాలన్న తపనతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పని చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా గల ప్రెస్టన్ కళాశాల గ్రౌండ్ లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని పేదల గుమ్మానికి చేర్చే బాధ్యతతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అదనంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కొత్త తెల్ల రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలను అమలు చేశామని తెలిపారు.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు హాస్టళ్లలో డైట్ ఛార్జీలను 40 శాతం పెంచడంతో పాటు కాస్మోటిక్ ఛార్జీలను గణనీయంగా పెంచామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో సుమారు రూ.200 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ స్థాయి ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థలను నిర్మిస్తున్నామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. వచ్చే దసరా నాటికి 2.18 లక్షల ఇళ్లు పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ప్రతి నియోజకవర్గానికి సమానంగా 3,500 ఇళ్లు మంజూరు చేశామని, జనగామ నియోజకవర్గానికి కూడా అదే విధంగా ఇళ్లు ఇచ్చామని తెలిపారు. లబ్ధిదారులు నిర్మాణ పనులు చేసిన దశలను బట్టి ప్రతి సోమవారం వారి ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తున్నామని చెప్పారు.





