రంగారెడ్డి జిల్లా : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకి సొంత భవనం ఉండేలా చూసేందుకు ‘శాచురేషన్ మోడ్’ (పూర్తి స్థాయి లక్ష్య సాధన విధానం)లో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాన్ని చేపడుతున్నట్లు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 5,118 గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు లేవని, వీటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించిందని మంత్రి పేర్కొన్నారు. 3,269 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం ఇప్పటికే 70% పూర్తయిందని, మిగిలిన పనులను ఈ ఏడాదిలోనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం, అన్ని గ్రామ పంచాయతీలకు శాచురేషన్ మోడ్‌లో సొంత భవనాలను నిర్మిస్తాం అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక భవనం ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ప్రాంతీయ సమీక్షా సమావేశం జరిగింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా శాఖల పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి సమీక్షించారు. గ్రామ పంచాయతీ భవనాలతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా 8,000 గ్రామాల్లో మహిళా సంఘాల కోసం ప్రత్యేక భవనాలను నిర్మిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ. 800 కోట్లు కేటాయించిందని, నిర్మాణ పనులు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణలో HAM (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) విధానం కింద గ్రామీణ రహదారులను నిర్మిస్తున్నామని, దేశంలోనే ఈ విధానాన్ని గ్రామీణ రహదారుల నిర్మాణానికి ఉపయోగించడం ఇదే మొదటిసారని మంత్రి వెల్లడించారు. HAM ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో సుమారు రూ. 3,382 కోట్ల అంచనా వ్యయంతో 3,861 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మిస్తున్నట్లు ఆమె తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా HAM ప్రాజెక్టు మొదటి దశలో చేపట్టిన రహదారులలో దాదాపు 50 శాతం ఈ నాలుగు జిల్లాల్లోనే ఉన్నందున అధికారులు , కాంట్రాక్టర్లు ప్రత్యేక శ్రద్ధతో పనులు చేపట్టాలని ఆదేశించారు.





