న్యూఢిల్లీ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26లో తెలంగాణ రాష్ట్రంలో తొలి స్వచ్ఛ నగరంగా గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా కేంద్ర గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ఈ జాతీయ గుర్తింపు లభించింది. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, ఘన వ్యర్థాల శుద్ధి, మురుగునీటి నిర్వహణ, పరిశుభ్రత, ప్రజల భాగస్వామ్యం వంటి ప్రధాన అంశాల ప్రాతిపదికన జీహెచ్ఎంసీ ఈ పురస్కారానికి ఎంపికైంది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ , హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
హైదరాబాద్ గ్రీన్ సిటీగా, నెట్‌జీరో సిటీగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో వివిధ ప్రమాణాల ఆధారంగా హైదరాబాద్‌కు ఈ గుర్తింపు లభించడం నగరానికి, రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. ఈ పురస్కారం సాధించడంలో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం అంకితభావంతో చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. వారి సమష్టి కృషికి లభించిన గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అభివర్ణించారు.
హైదరాబాద్‌లో పారిశుద్ధ్య ప్రమాణాలను మరింత మెరుగు పరచడం, పట్టణ పరిశుభ్రతను పెంపొందించడం, పచ్చదనాన్ని విస్తరించడం ద్వారా నగరాన్ని పరిశుభ్రమైన, పర్యావరణహితమైన, సుస్థిర నగరంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ గుర్తింపు మరింత ప్రోత్సాహాన్నిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.




