Wednesday, 11 November 2026

న్యాయమైన కృష్ణా జలాల వాటా సాధించాలి

newsssealss-CM

హైద‌రాబాద్ : కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాను సాధించేందుకు సుప్రీంకోర్టులో బలమైన వాదనను వినిపించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌తో వివాదంలో ఉన్న అన్ని అంశాలపై అవసరమైన సాక్ష్యాధారాలను సమర్పించాలని సూచించారు. ఈ నెల 18వ తేదీ తర్వాత సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు రానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి న్యాయ నిపుణులతో ఈ విషయంపై చర్చించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డి భోడి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి నీటి పారుదల శాఖపై స‌మీక్ష చేప‌ట్టారు. మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎంవో కార్యదర్శి మాణిక్ రాజ్, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ. శ్రీధర్, సంయుక్త కార్యదర్శి కె. శ్రీనివాస్, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

డిండి అచ్చంపేట ఎత్తిపోతల ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఇంజనీర్లను ఆదేశించారు. ఇప్పటికే నిర్ణయించిన ప్రకారం డిండి – అచ్చంపేట ప్రాజెక్టులకు ఏదుల‌ నుంచి నీటిని సరఫరా చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమైన 0.6 టీఎంసీల నీటిని నల్లాపూర్ నుంచి ఏదుల‌కు తరలించేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని అన్నారు. సొరంగాలు, కాలువలు ఎక్కడ అవసరమో గుర్తించి, సవివరమైన ప్రాజెక్ట్ రిపోర్టును సిద్ధం చేసి, తదనుగుణంగా పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు కాళేశ్వరంలో అదనపు టీఎంసీ పనుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని హెచ్చరించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను పునరావృతం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *