తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 16వ తేదీ పుష్ప యాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. నవంబరు 15న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్ప యాగానికి అంకురార్పణ నిర్వహించనున్నారు. పుష్ప యాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.
మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ కారణంగా నవంబర్ 16వ తేదిన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసినట్లు ప్రకటించారు తిరుమల తిరుపతి దేవస్తానం సాధికారక కమిటీ చైర్మన్ , ముఖ్య కార్య నిర్వహణ అధికారి ముద్దాడ రవిచంద్ర. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఇదిలా ఉండగా స్వామి వారి పుష్పయాగం సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.




