వరంగల్ జిల్లా : ప్రముఖ ప్రవచనకర్త , పద్మశ్రీ గరికపాటి నరసింహా రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రోజు రోజుకు టెక్నాలజీ మారుతోందని ఇదే సమయంలో మన మూలాలు మరిచి పోవద్దని సూచించారు. సాంకేతిక పురోగతితో పాటు మన సంస్కృతిని కూడా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక ప్రపంచంలో సంస్కృతిని, సంప్రదాయాలను , మానవీయ విలువలను కాపాడు కోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లో ‘సాంకేతిక ప్రపంచంలో సంస్కృతి ప్రాముఖ్యత’ అనే అంశంపై ఆయన ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. ఎన్ఐటీ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్‌కు చెందిన ‘ఏకధ్వని’ (తెలుగు , ప్రాంతీయ భాషా సాహిత్య వేదిక) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ సందర్బంగా గరికిపాటి మాట్లాడారు. కీలక సూచనలు చేశారు. ప్రజలు ఆధునిక సాంకేతికతను స్వీకరించేటప్పుడే, తమ సాంస్కృతిక మూలాలను కూడా భద్ర పరుచుకోవాలని సూచించారు. తెలుగు భాష, సాహిత్యం ఈ ప్రాంతపు సాంస్కృతిక వారసత్వానికి అద్దం పడతాయని అన్నారు. సాంప్రదాయ జ్ఞానాన్ని భావి తరాలకు అందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని గరికపాటి నరసింహారావు పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులతో సంభాషించి, వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫెసర్ పి. రతీష్ కుమార్, రిజిస్ట్రార్ సునీల్ కె. మెహతా, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ కె. కిరణ్ కుమార్, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ వేలగపూడి వాసు పాల్గొన్నారు. ‘ఏకధ్వని’ సాహిత్య వారోత్సవాల్లో భాగంగా పదబంధాల పోటీలు , కళలు, ఉపన్యాసాలు , సృజనాత్మక రచనల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నరసింహారావు బహుమతులు అందజేశారు. విద్యార్థులలో తెలుగు భాషా నైపుణ్యాలను, సాహిత్య ఆసక్తిని, ప్రసంగ సామర్థ్యాన్ని , సృజనాత్మకతను పెంపొందించే లక్ష్యంతో ఈ పోటీలను నిర్వహించారు.




