Tuesday, 10 November 2026

తాగునీటి ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలి

newsseals-MD

హైద‌రాబాద్ : మహానగర భవిష్యత్తు తాగునీటి అవసరాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్–2, 3 పనులను మరింత వేగవంతం చేయాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ కె. అశోక్ రెడ్డి అధికారులను, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు. గోదావరి ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పైప్‌లైన్ నిర్మాణం, టన్నెల్ తవ్వకం, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనుల పురోగతిని సమీక్షించారు. ఇప్పటి వరకు పూర్తయిన పనులు, పెండింగ్ పనులు, నిర్దేశించిన మైలురాళ్లు, వాటి పూర్తికి అవసరమైన కాలవ్యవధిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఘన్‌పూర్ వద్ద నిర్మిస్తున్న 80 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణ పనులను ఎండీ పరిశీలించారు. ముఖ్యంగా రిజర్వాయర్ కాంక్రీట్ పనులను పరిశీలించి, నిర్మాణ నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు . కాంక్రీట్ పనుల్లో నిర్దేశించిన సాంకేతిక ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తూ నిర్మాణాలను చేపట్టాలని సూచించారు. పనుల వేగంతో పాటు నిర్మాణాల నాణ్యత, పటిష్ఠతకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. అనంతరం ఘన్‌పూర్ వద్ద నిర్మిస్తున్న రోజుకు 1,170 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేసే సామర్థ్యం గల వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణ పనులను ఎండీ పరిశీలించారు.

ప్లాంట్‌లోని వివిధ యూనిట్ల నిర్మాణ పురోగతి, సివిల్ పనులు, ఇతర సాంకేతిక అంశాలపై అధికారులను, నిర్మాణ సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా పనుల్లో వేగం పెంచాలని, వివిధ విభాగాల పనులను సమాంతరంగా చేపట్టాలని ఆదేశించారు. పైపుల తయారీ, రవాణా, ట్రెంచింగ్, లేయింగ్, వెల్డింగ్, జాయింటింగ్ తదితర పనుల్లో మరింత వేగం పెంచాలని అన్నారు. అవసరమైన అదనపు యంత్రాలు, కార్మిక బృందాలను రంగంలోకి దించి వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో పనులు చేపట్టాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *