న్యూఢిల్లీ : కొత్త వాయిస్, SMS-మాత్రమే టారిఫ్ వోచర్లను ఎంపీ రాఘవ్ చద్దా స్వాగతించారు. ప్రీపెయిడ్ ప్లాన్లపై తన పార్లమెంట్ జోక్యం తర్వాతే TRAI ఈ చర్య తీసుకుందని అన్నారు. మరింత సరళమైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ఎంపికల కోసం పార్లమెంటులో తాను చేసిన డిమాండ్‌ను అనుసరించి ఈ చర్య తీసుకున్నారని పేర్కొన్నారు. వాయిస్ , SMS-మాత్రమే టారిఫ్ వోచర్ల ప్రవేశాన్ని రాఘవ్ చద్దా స్వాగతించారు. తక్కువ ధరకు కేవలం వాయిస్ కాల్స్, SMSల కోసం మాత్రమే సర్వీస్ టారిఫ్ వోచర్లను జారీ చేయాలని టెలికాం ఆపరేటర్లను కేంద్రం ఆదేశించడం నిర్మాణాత్మక రాజకీయాలకు ఒక చక్కటి ఉదాహరణ అని పేర్కొన్నారు. మార్చి 11న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తాను ఈ విషయాన్ని లేవనెత్తిన తర్వాత, ప్రత్యేక టారిఫ్ వోచర్లను (STVలు) జారీ చేయమని ప్రభుత్వం టెలికాం ఆపరేటర్లను కోరిందని చద్దా ఒక వీడియో సందేశంలో తెలిపారు.
ఇది నిర్మాణాత్మక రాజకీయాలకు ఒక చక్కటి ఉదాహరణ అని చద్దా అన్నారు,. నిజమైన భారతదేశం నిజమైన సమస్యలను మనం ఇలాగే కలిసి పరిష్కరించు కుంటామని నేను ఆశిస్తున్నాను అని ఆయన జోడించారు. 22న టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన టెలికాం వినియోగదారుల రక్షణ (పదమూడవ సవరణ) నిబంధనలు- 2026 ప్రకారం ప్రస్తుతం ఉన్న డేటా, వాయిస్ కాల్స్ , SMSలతో కలిపి 30 రోజులు లేదా అంతకంటే తక్కువ కాలపరిమితితో వచ్చే టారిఫ్ వోచర్ల మాదిరిగానే, టెలికాం ఆపరేటర్లు కేవలం వాయిస్ కాల్స్ , SMSల కోసం మాత్రమే ప్రత్యేక టారిఫ్ వోచర్లను జారీ చేయాల్సి ఉంటుంది.





