అమరావతి : మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా చేసే పోరాటం కేవలం చట్టపరమైన చర్యలతోనే ముగిసిపోదు అని అన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. గురువారం సచివాలయంలోని తన ఛాంబర్ లో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రి అనితతో పాటు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ , పలువురు మంత్రులు హాజరయ్యారు. యువతను సరైన మార్గంలో నడిపించడానికి సామాజిక బాధ్యత కూడా అవసరం అని అభిప్రాయపడ్డారు అనిత. అవగాహన కల్పించడం , మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడం ద్వారా మన యువత భవిష్యత్తును కాపాడేందుకు తాము దృఢమైన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
“డ్రగ్స్ వద్దు బ్రో” (Drugs Vaddhu Bro) అనే సందేశం ప్రతి యువకుడి గొంతుకగా మారాలని పిలుపునిచ్చారు అనిత వంగలపూడి. మన యువత మత్తుకు దూరంగా ఉంటూ, తమ లక్ష్యాలకు దగ్గరగా ఉంటూ ముందుకు సాగాలని కోరారు. రాష్ట్రంలో గతంలో ఏలిన జగన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం హయాంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ నీళ్లలా పారించారని ఆరోపించారు మంత్రి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్ సరఫరాపై ఉక్కుపాదం మోపామని చెప్పారు. అంతేకాకుండా యువతకు అవగాహన కల్పించడం జరుగుతోందని తెలిపారు అనిత వంగలపూడి. ఎవరైనా, ఎంతటి వారైనా సరే డ్రగ్స్ ను సరఫరా చేసినా లేదా మద్దతు ఇచ్చినా ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.





