బెంగళూరు : దృఢమైన పట్టణ రవాణా వ్యవస్థ నిర్మాణం అవసరం అని పేర్కొన్నారు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీజన. గురువారం బెంగళూరులో జరిగిన ‘మొబిలిటీ సింపోజియం 2026సలో కమిషనర్ పాల్గొన్నారు. ఇందులో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్; గ్రేటర్ బెంగళూరు అథారిటీ చీఫ్ కమిషనర్ , అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లతో కలిసి పట్టణ ప్రజా రవాణా సామర్థ్యం , భవిష్యత్తుపై చర్చించారు. ఈ చర్చలో బస్సులు, మెట్రో అనుసంధానం, నడక , సైక్లింగ్, అలాగే ‘ఫస్ట్-మైల్’ ‘లాస్ట్-మైల్’ కనెక్టివిటీకి సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా, ఇవన్నీ విడివిడి వ్యవస్థలుగా కాకుండా, ఒకే అనుసంధానిత ప్రయాణంలో భాగంగా ఎలా పని చేయాలనే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది.
వేగంగా విస్తరిస్తున్న నగరాలకు, కేవలం రవాణా మౌలిక సదుపాయాలను పెంచడమే కాకుండా… ఇల్లు, కార్యాలయం , ఇతర గమ్యస్థానాల మధ్య జరిగే దైనందిన ప్రయాణాన్ని మరింత నమ్మదగినదిగా, అందుబాటులో ఉండేలా దృఢమైనదిగా (resilient) మార్చడం ఒక సవాలుగా మారిందని కమిషనర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. నగరాల విస్తరణకు అనుగుణంగా ప్రజా రవాణా సామర్థ్యాన్ని పెంపొందించడానికి అవసరమైన అంశాలపై అనుభవాలు , దృక్పథాల పరస్పర మార్పిడికి ఇది ఒక చక్కని వేదికగా నిలిచింది.





