న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో బిజీగా ఉన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ను తన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్బంగా కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా తమ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు నారా చంద్రబాబు నాయయుడు. మదనపల్లెలో ఇటీవల ప్రారంభమైన ‘రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్’ ప్రాజెక్ట్ కార్యక్రమానికి ఆమె హాజరైనందుకు , ఆ ప్రాజెక్ట్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించినందుకు ఆయన ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విదేశీ సహకారంతో చేపట్టే ప్రాజెక్టులలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలకు సంబంధించిన అంశాలపై వారు చర్చించారు.
ఇప్పటి వరకు ఏపీకి పెద్ద ఎత్తున నిధులు కేంద్రం నుంచి రావాల్సిన విషయాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు వివరించారు. దీని వల్ల ఆర్థిక భారం తమపై పడుతోందని, తక్షణమే ఏపీకి రావాల్సిన నిధులను వెంటనే మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. మరో వైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు త్వరితగతిన కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తక్షణమే మిగిలి పోయిన నిధులు మంజూరు చేయాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ , పార్లమెంటరీ పార్టీ నాయకులు లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా పాల్గొన్నారు.





