పెనుకొండ : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. దీనిపై శుక్రవారం ఎస్. సవిత స్పందించారు. కోర్టు ఇచ్చిన తీర్పునకు కట్టుబడి ఉంటామన్నారు. రిజర్వేషన్ల కోసం చిట్టచివరి వరకూ న్యాయ పోరాటం చేశాం అని చెప్పారు. సుప్రీం కోర్టులో బీసీలకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశించాం అని తెలిపారు. కూటమి కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఢిల్లీలో మకాం వేసి బీసీ రిజర్వేషన్ల కోసం న్యాయ నిపుణులతో చర్చించడం జరిగిందన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలు హామీకి కట్టుబడి ఉన్నాం అన్నారు. పార్టీ పరంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం అని ప్రకటించారు ఎస్ సవిత.
బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించడమే సీఎం చంద్రబాబు లక్ష్యం అని స్పష్టం చేశారు. బీసీలు రాజకీయంగా ఎదగడం జగన్ మోహన్ రెడ్డికి ఏ మాత్రం ఇష్టం లేదని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేయడం దారుణమన్నారు. గతంలోనూ బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్న చరిత్ర జగన్ రెడ్డిదేనని మండిపడ్డారు. 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి కుదించాడని ఫైర్ అయ్యారు. జగన్ తీరుతో 16,800 పదవులు బీసీలు కోల్పోయారని వాపోయారు ఎస్. సవిత. బీసీల సంక్షేమం కోసం ఏర్పడిన పార్టీ టీడీపీ అని అన్నారు. కూటమి ప్రభుత్వంలోనూ బీసీలకు పెద్ద పీట వేస్తున్నాం అని చెప్పారు. ఎంఎస్ఎంఈ పార్కుల్లో బీసీలకు అవకాశమిచ్చి పారిశ్రామిక వేత్తలుగా తీర్చి దిద్దుతున్నాం అన్నారు.





