అమరావతి : బీసీ రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు నిర్ణయంపై కొండపి సభలో స్పందించారు. పార్టీ పరంగా బీసీలను ఆదుకుంటామని ప్రకటించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ టీడీపీకి అండగా నిలిచేది వెనుకబడిన వర్గాలేనని పేర్కొన్నారు. వారికి సామాజికంగా, ఆర్ధికంగా రాజకీయంగా పార్టీ సహకరించిందని చెప్పారు. మేం తీసుకువచ్చిన 34 శాతం రిజర్వేషన్లు అమలు కానీకుండా గత పాలకులు వ్యవహరించారని ఆరోపించారు. రిజర్వేషన్లను 24 శాతానికి కుదించటం వల్ల ఎంతోమంది నష్ట పోయారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. మళ్లీ కూటమి అధికారంలోకి వచ్చాక బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పెంచాం అని తెలిపారు.
కానీ గొడ్డలి పార్టీ కోర్టుకు వెళ్లి రిజర్వేషన్లు అమలు కానీయకుండా అడ్డుకుందని మండిపడ్డారు. హైకోర్టు, సుప్రీం కోర్టులో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్నారు చంద్రబాబు నాయుడు. బీసీలకు రిజర్వేషన్లు అమలు కాకూడదన్నది గొడ్డలి పార్టీ కుట్ర. అందుకే కేసులు వేసిందన్నారు. వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలని ఎప్పుడూ కోరుకునేది మేమేనని అన్నారు. బీసీలకు న్యాయం జరక్కూడదు, రిజర్వేషన్లు రాకూడదు, బాగు పడకూడదనే అడ్డం పడ్డారని ఫైర్ అయ్యారు. సుప్రీం కోర్టు ఈ రిజర్వేషన్ల అమలు జీవోను కొట్టివేసింది. అయినా మేం పార్టీ పరంగా బీసీలను ఆదుకుంటాం అని ప్రకటించారు. పార్టీ పరంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించి అండగా నిలబడతాం అన్నారు.





