రిజర్వేషన్లలు అమలు చేసేంత దాకా పోరాటం ఆగదు
హైదరాబాద్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ శనివారం ఉస్మానియా విశ్వ విద్యాలయంలో బీసీ విద్యార్థులు కదం తొక్కారు. తెలంగాణలో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల సాధన ఉద్యమంలో భాగంగా ఉస్మానియా యూనివర్శిటీలో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ నుండి తార్నాక చౌరస్తా వరకు ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్లు, విద్యార్థులతో కలిసి నిర్వహించారు . ఈ ర్యాలీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో BC జనాభా నిష్పత్తి ప్రకారం విద్య, ఉద్యోగాలు, రాజకీయంగా 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాంండ్ చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఉద్యమం సామాజిక న్యాయం, సమానత్వం, సమగ్ర అభివృద్ధి అనే విలువలపై ఆధారపడి ఉందని వారు స్పష్టం చేశారు.
ప్రభుత్వం BC వర్గాలకు అన్ని రంగాల్లో తగిన వాటా కల్పించాలన్న తమ వాగ్దానాన్ని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీసీ బంద్ కు పిలుపునిచ్చారు. బీసీ జేఏసీ చైర్మన్ బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ లు ఆందోళన బాట పట్టారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని , అమలు చేసేంత వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు చేయడం మానుకుని అమలుపై ఫోకస్ పెట్టాలని డిమాండ్ చేశారు.






