ప్రకటించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నిజామాబాద్ జిల్లా : తెలంగాణ సాకారం చేయడంలో కీలకమైన పాత్ర పోషించిన ఘనత తెలంగాణ జాగృతి సంస్థ అని స్పష్టం చేశారు సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ముఖ్య భూమిక పోషించిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. తనకు రాజకీయ పరంగా అద్భుతమైన అవకాశం ఇచ్చిన నేల నిజామాబాద్ జిల్లా అని అన్నారు. ఇక్కడి నుంచే తాను పార్లమెంట్ సభ్యురాలిగా, శాసన మండలి సభ్యురాలిగా ఎన్నికయ్యానని చెప్పారు. ఆదివారం తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో జాగృతి జనం బాటకు శ్రీకారం చుట్టారు. భారీ ఎత్తున హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తను జీవితాంతం ఇక్కడి ప్రజలను, జిల్లాను గుర్తు పెట్టుకుంటానని అన్నారు.
తెలంగాణ పునర్ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములైనా ఇంకా సాధించాల్సింది చాలా ఉందన్నారు కల్వకుంట్ల కవిత. తెలంగాణ రాష్ట్రం, దాని ప్రజల శ్రేయస్సును నిర్ధారించడంలో తెలంగాణ జాగృతి ఎల్లప్పుడూ ముందంజలో ఉందని స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ కలను సాకారం చేయడంలో తెలంగాణ జాగృతి ఉత్ప్రేరకంగా వ్యవహరించిందని చెప్పారు కవిత. ఇవాళ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. మరోసారి సామాజిక తెలంగాణ కోసం పోరాడేందుకు శ్రీకారం చుట్టామన్నారు. అందులో భాగంగానే జాగృతి జనం బాటకు శ్రీకారం చుట్టామన్నారు. అన్ని వర్గాల ప్రజలను కలిసేందుకు తాను వస్తున్నానని చెప్పారు.






