క్షేత్ర స్థాయిలో పర్యటించిన కమిషనర్లు
హైదరాబాద్ : మోంథా తీవ్ర తుపానుతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో బుధవారం హైదరాబాద్ లోని లకడికాపూల్ పరిసర ప్రాంతాలను హైడ్రా, జీహెచ్ ఎంసీ కమిషనర్లు ఏవీ రంగనాథ్ , ఆర్ వీ కర్ణన్ పరిశీలించారు. మాసబ్ ట్యాంకు నుంచి లకడికాపూల్ వైపు వస్తున్నప్పుడు మెహదీ ఫంక్షన్ హాల్ వద్ద వర్షపు నీరు రోడ్డు మీద నిలవడానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ వర్షపు నీరు నిలవడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని ఇరువురు కమిషనర్లు ఆదేశించారు. ఇప్పటికే ఇక్కడ ఇరువైపులా రోడ్డును తవ్వి రెండు ఫీట్ల విస్తీర్ణంతో ఉన్న పైపులైన్లను వేశామని తెలిపారు.
వాటికి మహవీర్ ఆసుపత్రి పరిసరాలతో పాటు చింతలబస్తీ ప్రాంతాల నుంచి వచ్చిన మురుగు, వరద నీటిని అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. త్వరితగతిన ఈ పనులు కూడా పూర్తి చేయాలని సూచించారు. ఈ లోగా మహావీర్ ఆసుపత్రి ముందు నుంచి మెహిదీ ఫంక్షన్ హాల్ వరకు రోడ్డుకు పక్కగా ఉన్న పైపులైన్లలో పేరుకు పోయిన మట్టిని తొలగిస్తే, సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుందని కమిషనర్లు సూచించారు. ఒకటి రెండు రోజుల్లో ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ పోలీసులు కూడా సహకరించి పైపులైన్ల అనుసంధాన పనులు త్వరగా జరిగేలా సహకరించాలని స్పష్టం చేశారు ఏవీ రంగనాథ్, కర్ణన్. లకడికాపూల్ పరిసరాలను సందర్శించిన వారిలో హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ కూడా కమిషనర్లతో పాటు ఉన్నారు.






