స్పష్టం చేసిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు చెరువులు, నాలాలపై . గొలుసుకట్టు చెరువులకు ప్రాణాధారమైన నాలాలను కూడా పరిరక్షించు కోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అప్పడే నగరంలో వరదలను నివారించగలమని చెప్పారు. చెరువుల ఆవశ్యకతను వివరిస్తూ ఒక ఎకరం పరిధిలో మీటరు లోతులో 4 మిలియన్ లీటర్ల నీటిని ఆపగలమన్నారు. ఈ లెక్కన వరదలను నివారించడానికి చెరువులు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నారు ఏవీ రంగనాథ్. ప్రభుత్వ భూములు, చెరువుల, నాలాలు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను పరిరక్షించడంతో పాటు.. ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కోడానికి హైడ్రాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
ప్రకృతిని మనం కాపాడితే.. ప్రకృతి వైపరీత్యాల నుంచి చాలా వరకు బయట పడగలమన్నారు. నగరంలో చెరువులు దాదాపు 61 శాతం కనుమరుగయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు ఏవీ రంగనాథ్. వాటిని వీలైనంతవరకు పునరుద్ధరించేందుకు హైడ్రా కృషి చేస్తోందని చెప్పారు ఏవీ రంగనాథ్. కార్పొరేట్ సంస్థలు కూడా ఇందుకోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చెరువులు శాశ్వత ఆస్తులుగా పరిగణించి ముందు తరాలవారికి వాటిని భద్రంగా అప్పజెప్పాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. చెరువుల చెంత… పిల్లలు ప్రశాంతమైన వాతావరణంలో ఆడుకునేలా.. అక్కడ అన్ని వయసుల వారు సేదదీరే విధంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. సీఎస్ ఆర్ సమ్మిట్ ముఖ్య ఉద్దేశాలను ఎమ్మెల్సీ ప్రొ. కోదండరామ్ వివరించారు. హైడ్రాకు తమవంతు సహకారం అందిస్తామని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఖైరతాబాద్ ఛైర్మన్ ప్రొ . డా. రమణ నాయక్ తెలిపారు.






