మంజూరు చేసినందుకు పవన్ కళ్యాణ్ థ్యాంక్స్
అమరావతి : దేశంలోనే పిఠాపురం నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారుస్తామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. ఈ సందర్బంగా ఆలయాల పురోభివృద్దికి, పునర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన దేవాదాయ, ధర్మాదాయ శాఖా మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్రముఖ శక్తిపీఠం శ్రీ పురూహుతికా అమ్మవారి ఆలయం, శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయం, శ్రీపాద శ్రీ వల్లభ స్వామి ఆలయాలకు సంబంధించి డీటైలెడ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేయాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం. శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా సుమారు రూ.6 కోట్లు వెచ్చించి పిండ ప్రదాన మండపం, అన్నదాన మండప నిర్మాణంతోపాటు కోనేరు మరమ్మతులు చేపట్టేందుకు కామన్ గుడ్ ఫండ్ నుంచి ఇప్పటికే నిధులు మంజూరు చేసేందుకు దేవాదాయ శాఖ ఆమోదం లభించింది.
శ్రీపాద శ్రీ వల్లభ స్వామి ఆలయం అభివృద్ధికి రూ.2 కోట్లు కామన్ గుడ్ ఫండ్ ద్వారా మ్యాచింగ్ గ్రాంట్ తో మంజూరు అయ్యింది. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి అయిన శ్రీ పురూహుతికా అమ్మవారి ఆలయ అభివృద్ధికి డీపీఆర్ సిద్ధం చేయిస్తున్నామన్నారు పవన్ కళ్యాణ్. పిఠాపురం శ్రీ సీతా రామాంజనేయ ఆశ్రమం అభివృద్ధికి రూ.60 లక్షలు, శ్రీ జై గణేష్ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.65 లక్షలు, చిత్రాడలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ.70 లక్షలు మంజూరైనట్లు తెలిపారు . వీటితో పాటు జీర్ణావస్థకు చేరిన పలు ఆలయాలను అభివృద్ధి చేసేందుకు దేవాదాయ శాఖ ముందుకు వచ్చిందన్నారు. పిఠాపురం మండలం నవఖండ్రవాడలోని శ్రీ నక్కుల్లమ్మ అమ్మవారి ఆలయం, శ్రీ రామాలయం, గొల్లప్రోలు శ్రీ సిరితల్లి ఆలయం, తాటిపర్తిలోని శ్రీ మార్కండేయ సహిత భద్రావతి భావనరుషి స్వామి వారి ఆలయాలను ధూప దీప నైవేధ్యం పథకం పరిధిలోకి తీసుకునేందుకు దేవాదాయ శాఖ అంగీకారం తెలపడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్.







