ఎంత కాలం దాడులు చేస్తారు
భయపడే ప్రసక్తి లేదన్న రాహుల్
అరుణాచల్ ప్రదేశ్ – ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. భారత్ జోడో న్యాయ్ యాత్రను అడ్డుకోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా లేదా ఇబ్బందులకు గురి చేసినా భయపడే ప్రసక్తి లేదన్నారు. ఈ దేశం బీజేపీ దాని అనుబంధ సంస్థలది కాదని 140 కోట్ల భారతీయులదని తెలుసుకుంటే మంచిదని సూచించారు.
సోమవారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఇకనైనా ఇలాంటి దాడులు మానుకోవాలని స్పష్టం చేశారు. దాడులు చేసుకుంటూ పోతే చివరకు ఎవరూ మిగలరన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసి, మతం పేరుతో, ప్రాంతాల పేరుతో, కులాల పేరుతో చిచ్చు పెట్టి ఓట్ల రాజకీయాలు చేస్తున్నది ఎవరో దేశానికి తెలుసన్నారు.
తాము ఎవరికీ వ్యతిరేకం కాదని కానీ ప్రజల గొంతుకను వినిపించడం నేరం ఎట్లా అవుతుందని ప్రశ్నించారు. సాటి వారిని మనుషులుగా గౌరవించ లేని వాళ్లు దేశాన్ని ఎలా ఉద్దరిస్తారని అనుకోవాలని అన్నారు రాహుల్ గాంధీ. ఇకనైనా మోదీ , ఆయన పరివారం పునరాలోచించుకుంటే మంచిదని హితవు పలికారు. రాబోయే రోజుల్లో నీతికి నిజాయితీకి ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్దమన్నారు.