స్పష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్
అమరావతి : ఈ భూమి మీద పుట్టిన అద్భుతమైన వ్యక్తి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా అన్నారు మంత్రి కందుల దుర్గేష్. సేవకు పర్యాయపదం, ప్రతిరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ఆయన ప్రపంచ మానవాళికి ప్రవచనాలు బోధించడమే కాకుండా, వైద్యాలయాలు, విద్యాలయాలు స్థాపించి, నీటి వసతి లేని మెట్ట ప్రాంతాల వరకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించి మానవ సేవకు కొత్త నిర్వచనంగా నిలిచారని ప్రశంసలు కురిపించారు. సమాజ హితం కోసం, భావి తరాల జీవితాలు అందంగా తీర్చిదిద్దు కునేందుకు ఆయన చూపించిన మార్గం ఎంతగానో ఉపయోగ పడుతుందని అన్నారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు బాల్యదశ నుండే ఆయన ఆలోచనా దృక్పథాన్ని అలవరుచు కోవడం సంతోషంగా ఉందన్నారు కందుల దుర్గేష్.
బుధవారం రాజ మహేంద్రవరం లోని శ్రీ సత్యసాయి గురుకులం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవంలో పాల్గొని ప్రసంగించారు మంత్రి. ఈ సందర్బంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. అనంతపురంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తో పాటు నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తో పాటు సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారని చెప్పారు. ఈ శత జయంతి వేడుకలను నవంబర్ 23న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా పెద్దఎత్తున నిర్వహిస్తోందని ప్రకటించారు కందుల దుర్గేష్. ఈ వేడుకల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీలో సభ్యుడిగా ఉండటం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని న్నారు.







