తెలంగాణ విద్యావేత్తకు అభినందనల వెల్లువ
హైదరాబాద్ : ఎంతో మందిని ఐఐటీయన్లుగా మార్చిన తెలంగాణకు చెందిన విద్యావేత్త రామయ్య ఇవాల్టితో 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ చేస్తున్నారు ప్రముఖులు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. విషయం తెలుసుకున్న వెంటనే మాజీ మంత్రి కేటీఆర్ స్వయంగా ఐఐటీ రామయ్య ఇంటికి వెళ్లారు. సామాజిక ఉద్యమకారుడు చుక్కా రామయ్యకు 100వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
విద్యానగర్ లో ఉన్న చుక్కా రామయ్య నివాసానికి వెళ్లి శాలువాతో సత్కరించారు. ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ఆ దేవుడు మరిన్ని ఏళ్లు బతికేలా ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐఐటీ పూర్తి చేసి ప్రపంచ దేశాల్లో స్థిరపడడానికి కారణం చుక్కా రామయ్య అని కొనియాడారు. విద్యా ప్రదాత కాకుండా తెలంగాణ పోరాటంలో, రాజకీయాల్లో దిక్సూచిగా తన పాత్ర పోషించాడని కొనియాడారు. అలాంటి చుక్కా రామయ్య 100వ బర్త్ డే జరుపుకోవడం మనందరికీ ఎంతో స్ఫూర్తి దాయకమని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ తో పాటు జూలూరి గౌరీశంకర్ కూడా హాజరయ్యారు. ఐఐటీ రామయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.





