స్పష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్
శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక రంగానికి కేరాఫ్ గా మారుస్తామని స్పష్టం చేశారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని చారిత్రక లేపాక్షి శ్రీ వీరభద్ర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా మంత్రికి ఘన స్వాగతం లభించింది. అనంతరం ,స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భారతీయ శిల్పకళా వైభవానికి, విజయనగర సామ్రాజ్య నిర్మాణ నైపుణ్యానికి ఈ క్షేత్రం నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోందని చెప్పారు కందుల దుర్గేష్. ముఖ్యంగా, ప్రాంగణంలోని అద్భుతమైన ఏకశిలా నంది విగ్రహం, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గాలిలో వేలాడే స్తంభం (Hanging Pillar), ఆలయ పైకప్పుపై వేసిన అపురూపమైన కుడ్య చిత్రాలు (Murals) మన పూర్వీకుల గొప్ప సాంకేతిక పరిజ్ఞానాన్ని, కళాత్మక వారసత్వాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించాయని ప్రశంసలు కురిపించారు మంత్రి.
ఈ విలువైన చారిత్రక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని పరిరక్షించి, లేపాక్షిని అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు కందుల దుర్గేష్. ఇప్పటికే ఏపీ సర్కార్ యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగిందన్నారు.






