చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డు ఏర్పాటు చేసిన వైనం
హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. రంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ లో ఆక్రమణకు గురైన రూ. 700 కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కాపాడింది హైడ్రా. ప్రజావాణి సందర్భంగా కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పార్కులు ప్లాట్లుగా మారినట్టు క్షేత్ర స్థాయిలో పరిశీలించిన హైడ్రా అధికారులు గుర్తించారు. అబ్బినేని అనసూయతో పాటు ఇతరుల దగ్గర నుంచి వైబీకే రావు జీపీఏ కుదుర్చుకుని 1980 దశకంలో లే ఔట్ వేశారు. ఆ లే ఔట్ ప్రకారం ప్లాట్లు కొన్నవారు ఆయా ప్లాట్లను, నిర్మించిన భవనాలను ఎల్ ఆర్ ఎస్, బీఆర్ ఎస్ ద్వరా రెగ్యులరైజ్ కూడా చేసుకున్నారు. 1.20 ఎకరాల మేర ఉండాల్సిన పార్కును 3 భాగాలుగా విడదీసి 11 ప్లాట్లు చేసి అమ్మేసినట్టు నిర్ధారణ అయ్యింది. మరో రెండు పార్కులను కూడా అలాగే బై నంబర్లతో పలువురికి అమ్మేశారు.
ఇక్కడ లావాదేవీలు నిర్వహించిన వారికి ఎన్.ఆర్.ఐ. లే ముడిసరకుగా మార్చారంటూ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా అధికారులకు తెలిపారు. ఇక వీళ్ల దగ్గర నుంచి సింహా డెవలపర్స్, వాసవి నిర్మాణ సంస్థతో పాటు మరో ఇద్దరు ముగ్గురు కొని బౌన్సర్లను పెట్టి.. పార్కులవైపు వెళ్లడం కాదు కదా.. చూడడానికి కూడా అవకాశం లేకుండా చేశారని వాపోయారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా అధికారుల ముందు అక్కడ నివాసం ఉన్న వారు ఆవేదన వ్యక్తం చేశారు. రెసిడెంట్స్ వెల్ఫేర్ ఆసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. పార్కులతో పాటు ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడాలని హైకోర్టు కూడా సూచించింది. హైడ్రాకు మార్గదర్శనం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు పార్కుల చుట్టూ ఫెన్సింగ్ వేసి, బోర్డులను హైడ్రా ఏర్పాటు చేసింది. దీంతో అక్కడి స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే హైడ్రా స్పందించి పార్కులను కాపాడిందంటూ ధన్యవాదాలు తెలిపారు.






