సీఎం రేవంత్ రెడ్డిపై భగ్గుమన్న మాజీ మంత్రి
హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ సర్కార్ పై. ప్రజా పాలన పేరుతో రైతులను నట్టేట ముంచారని ఆరోపించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్బంగా రైతులతో మాట్లాడారు. రెండు లారీల సోయాబిన్ కొంటే అందులో 60 క్వింటాళ్లను వాపస్ పంపించారని ఆరోపించారు. నారాయణఖేడ్‌లో అయినా రాష్ట్రంలో అయినా మక్కలు, సోయాబీన్ పంట కొని నెల రోజులు పూర్తయినా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదన్నారు. పంట కొనుగోలు చేసిన 48 గంటల్లో చెల్లింపులు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం పూర్తిగా మోసం చేయడమేనని పేర్కొన్నారు. ముల్లకర్ర పట్టి పొడిచినా ఈ ప్రభుత్వానికి చలనం లేకుండా పోయిందన్నారు.
రాష్ట్రంలో సోయాబీన్ రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. కొనుగోలు చేయడం లేదని, కొన్న పంటను కూడా వాపస్ పంపిస్తున్నారని మండిపడ్డారు.వెంటనే మక్క, సోయాబిన్ పంట కొనుగోలు చేసి రైతులకు చెల్లింపులు జరపాలని డిమాండ్ చేశారు. రెండుసార్లు రైతుబంధు ఇచ్చి రెండుసార్లు ఎగ్గొట్టారని మండిపడ్డారు. పోయిన యాసంగి బోనస్ ఇంకా రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే రూ. 1150 కోట్లను యాసంగి బోనస్ కింద సన్న వడ్లకు చెల్లించాలని డిమాండ్ చేశారు హరీశ్ రావు. సాగు చేసిన భూమికే రైతుబంధు ఇస్తామని చావు కబురు చల్లగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. మూడు పంటలకు రైతుబంధు ఇయ్యాలని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సాగుచేసిన భూమికే రైతు బంధు ఇస్తా అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.





