5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి : జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి అంబాసిడర్లుగా పని చేయాలని, ప్రభుత్వంపై సానుకూలత రావాలంటే మీదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు . దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏపీ గురించే చర్చించుకునేలా… ప్రభుత్వంపై ప్రజలకున్న విశ్వసనీయత కొనసాగించేలా చూడాలని అధికారులకు మార్గదర్శనం చేశారు. పొలిటికల్ గవర్నెన్సు అనేది కీలకమని… కలెక్టర్లు తమ ప్రతిభ ద్వారా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా చూడాలని సీఎం చెప్పారు. ప్రతీ నిమిషం తనని తాను మరింత ఉన్నతంగా తీర్చిద్దుకుంటున్నాని ముఖ్యమంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో ఇక నుంచి స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఉండాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహా విధానాన్నే పరిపాలనలోనూ తెస్తున్నట్టు సీఎం ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో రెండు రోజుల పాటు జరుగుతున్న 5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో బుధవారం వివిధ అంశాలపై సీఎం జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, అధికారుల పనితీరును స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సే కొలమానంగా తీసుకుంటామని స్పష్టం చేశారు. కొన్ని జిల్లాలు అనుసరించే బెస్ట్ ప్రాక్టీసెస్ మిగతా జిల్లాల్లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని అంశాల్లో ప్రజాప్రతినిధుల సేవలను కూడా వినియోగించు కోవాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా నిత్య విద్యార్ధిగానే ఉండాలని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. నిరంతరం వివిధ అంశాలను తెలుసుకుంటూ అభివృద్ధిలో భాగస్వామి కావాలని చెప్పారు. కలెక్టర్ల సదస్సులో చర్చలు మొక్కుబడిగా సాగకుండా అర్థవంతమైన సమీక్షలు, చర్చలు జరపాలన్నారు. ప్రజల్లో సంతృప్తిని పెంచేలా పౌరసేవలను అందించాలని కలెక్టర్లను కోరారు.






