అద్భుతంగా తీశారంటూ కల్వకుంట్ల ప్రశంసలు
హైదరాబాద్ : తెలంగాణ ప్రాంతంలో జరిగిన వాస్తవిక ఘటన ఆధారంగా తెరకెక్కించిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. ఎవరూ ఊహించని విధంగా బిగ్ సక్సెస్ అయ్యింది. కాసుల వర్షం కురిపించింది. ఇందులో నటించిన ప్రతి ఒక్కరు తమ పాత్రలకు ప్రాణం పోశారు. మరిచి పోలేని విధంగా మనసులు దోచారు. తెలంగాణలో ప్రతిభకు కొదవ లేదని నిరూపించారు మరోసారి. ఇప్పుడు తెలంగాణ ప్రాంతపు అస్తిత్వాన్ని మరింత ద్విగుణీకృతం చేసేలా జానపదాలు యూట్యూబ్ ను, సినిమా రంగాన్ని షేక్ చేస్తున్నాయి. ఇదే ప్రాంతానికి చెందిన గాయనీ గాయకులు, మ్యూజిక్ డైరెక్టర్లు, రచయితలు, కవులు, కళాకారులు దుమ్ము రేపుతున్నారు.
తాజాగా విడుదలై భారీ ఆదరణను చూరగొంటున్న రాజు వెడ్స్ రాంబాయి సినిమా బృందానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు . హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో సినిమా నిర్మాత వేణు ఉడుగుల, దర్శకుడు సాయిలు కంపాటి, ప్రెజెంటర్ పూజారి నాగేశ్వర్ రావు, లిరిక్ రైటర్ మిట్టపల్లి సురేందర్, మ్యూజిక్ డైరెక్టర్ సురేశ్ బొబ్బిలి, నటుడు ఆదిత్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మురళీ ని ప్రత్యేకంగా అభినందించారు. మంచి సక్సెస్ సాధించిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఈ సందర్భంగా కవిత ఆకాంక్షించారు.







