ప్రకటించిన అనుముల రేవంత్ రెడ్డి
వికారాబాద్ జిల్లా : నూతనంగా ఎన్నికైన సర్పంచులకు తీపి కబురు చెప్పారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. కోస్గిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. సీఎం నిధుల నుంచి నేరుగా సర్పంచులకే ఫండ్ అందిచే బాధ్యత నాదని ప్రకటించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులకు ఇది అదనం అన్నారు. సర్పంచుల గౌరవం పెంచాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతీ పేద కుటుంబానికి సన్న బియ్యం అందిస్తున్నామని అన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, 9 నెలల్లో 9 వేల కోట్లు రైతు భరోసా అందించామన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. కోటి మంది మహిళలకు కోటి చీరలు అందించామని చెప్పారు.
సంక్షేమ పథకాలు ఎవరికి అందక పోయినా సర్పంచులు ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలని సూచించారు రేవంత్ రెడ్డి. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేలా చూసే బాధ్యత నాది అని అన్నారు. చదువొక్కటే మన జీవితంలో మార్పు తెస్తుందని, జీవితాల్లో వెలుగులు నింపుతుందని చెప్పారు రేవంత్ రెడ్డి. అందుకే పిల్లలను చదివించాలని, మీ పిల్లలు అధికారులై తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వచ్చే అకడమిక్ నుంచి చదువుతో పాటు అల్పాహారం, భోజనం అందిచే బాధ్యత నాదని ప్రకటించారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ మనకు అన్యాయం చేశారని, పాలమూరును పడావు పెట్టారంటూ ఆరోపించారు.






