ఎమ్మెల్యే భూమా అఖిలప్రియా రెడ్డి
అమరావతి : ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఈసందర్బంగా తమ నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్యలను ఆమె ఏకరువు పెట్టారు. ప్రధానంగా వెదురు ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న చెంచులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని కోరారు. ప్రధానంగా ఫారెస్ట్ అధికారులు విధించిన ఆంక్షలు నిజంగా బాధాకరమైనవని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వారు రెండు రోజులుగా చేస్తున్న నిరసన నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడుని కలిసి వారి ఆవేదనను ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు భూమా అఖిలప్రియ.
ఈ అంశంపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. సంబంధిత ఫారెస్ట్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం సహకారంతో ఈ సమస్యకు సమగ్ర పరిష్కారం చూపించి, చెంచులకు పూర్తి స్థాయిలో అండగా ఉంటానని భరోసా ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. తమ కూటమి సర్కార్ ఎవరినీ ఇబ్బందులకు గురి చేయదని స్పష్టం చేశారు. జీవనోపాధి కల్పిస్తుందే తప్పా పొట్ట కొట్టదన్నారు భూమా అఖిలప్రియ.






