వెల్లడించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
తిరుమల : వైకుంఠ ద్వార దర్శనం సందర్బంగా టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాట్లపై ఆరా తీశారు చైర్మన్ బీఆర్ నాయుడు. గురువారం ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా భక్తులతో సంభాషించారు. ఏర్పాట్లపై ఆరా తీశారు. లడ్డూలు ఎలా ఉన్నాయంటూ అడిగారు. ఆ తర్వాత నేరుగా టీటీడీ ఆధ్వర్యంలోని లడ్డూ విక్రయ కౌంటర్ల వద్దకు వెళ్లారు. అక్కడ సిబ్బందిని , పనితీరును స్వయంగా పరిశీలించారు. భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వద్ద. భక్తుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన కియోస్కీల పనితీరును కూడా తనిఖీ చేశారు. భక్తుల మనోభావాలకు పెద్దపీట వేస్తూ ఏర్పాట్లు చేశామన్నారు ఈ సందర్బంగా బీఆర్ నాయుడు.
అనంతరం తిరుమలలో చైర్మన్ మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించడంలో భాగంగా లడ్డూ విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం టీటీడీ రోజుకు 4 లక్షల లడ్డూలు, 8 వేల కళ్యాణోత్సవ లడ్డూలను భక్తులకు విక్రయిస్తోందని చెప్పారు. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా లడ్డూల కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. లడ్డూల నాణ్యత, రుచి, క్యూ లైన్లలో వేచి ఉండే సమయం తగ్గించడం వంటి సౌకర్యాలపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో లడ్డూల ఉత్పత్తిని పెంచి కౌంటర్ల వద్ద త్వరితగతిన భక్తులు లడ్డూలు పొందే విధంగా ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు.







