స్పష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్
అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా జ్యూయెల్స్ ఎగ్జిబిషన్లను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. రాజమహేంద్రవరంలోని జీకే గార్డెన్స్ వేదికగా నిర్వహించిన పాన్ ఇండియా జ్యూవెల్స్ ఎగ్జిబిషన్ ను జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు . ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ, ఆధునిక ఆభరణాల ప్రదర్శనను సందర్శించారు. ఎగ్జిబిషన్‌ను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలియ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆభరణాల కళా నైపుణ్యాన్ని ఒకే వేదికపై ప్రజలకు చేరువ చేయడం అభినందనీయం అని పేర్కొన్నారు.
ఇలాంటి ఎగ్జిబిషన్లు వాణిజ్య కార్యకలాపాలకు మరింత ఊతమివ్వడంతో పాటు, స్థానిక వ్యాపారాలు , ఆర్థికాభివృద్ధికి గణనీయంగా దోహద పడతాయని అభిప్రాయ పడ్డారు కందుల దుర్గేష్. ఇదిలా ఉండగా రాష్ట్రంలో అత్యంత ప్రతిభ కలిగిన కళా నైపుణ్యం కలిగిన వారు ఉన్నారని చెప్పారు. తమ కూటమి సర్కార్ పెద్ద ఎత్తున వారికి సహకారం అందించేందుకు కృషి చేస్తుందని అన్నారు. ఆప్కో ఆధ్వర్యంలో భారీ డిస్కౌంట్ తో చేనేత అమ్మకాలను కూడా ప్రారంభించడం జరిగిందన్నారు. త్వరలోనే ఆవకాయ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందు కోసం రాష్ట్ర సర్కార్ రూ. 5 కోట్లు మంజూరు చేసిందన్నారు. కవులు, కళాకారులు, రచయితలు, గాయనీ గాయకులు, సాంకేతిక నిపుణులు పాల్గొంటారని తెలిపారు.






