సీఎంపై వ్యక్తిగత విమర్శలు తగదు
హైదరాబాద్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి ఫైర్ అయ్యారు. పూర్తిగా సీఎం ఎ. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాలని, ఏక వచనంతో సంబోధించడం సరికాదని హితవు పలికారు. అభివృద్ధిపై చర్చకు రావాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. అలాగే, మంత్రుల అవినీతిపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను దానం తప్పుపట్టారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా సంజయ్ వద్దే దర్యాప్తు సంస్థలు ఉన్నాయని, ఆధారాలు ఉంటే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. తాను ఏనాడూ ఎన్నికలు అంటే వెనక్కి వెళ్లిన దాఖలాలు లేవన్నారు. ప్రజలతో ఎల్లప్పుడూ కలిసే ఉన్నానని చెప్పారు. బై ఎలక్షన్ కోసం రెడీగా ఉన్నానని, తన గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదని స్పష్టం చేశారు. ప్రజా నాయకుడిగా తాను ప్రజల కోసం పని చేస్తూ వచ్చానని, అందుకే అంత ధీమాగా ఉన్నానంటూ పేర్కొన్నారు దానం నాగేందర్.






