ఉక్కుపాదం మోపుతామన్న కమిషనర్
హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా కార్యాలయంలో ప్రజా వాణి నిర్వహించారు. మొత్తం బాధితుల నుంచి 44 దరఖాస్తులు వచ్చాయి. ఇంటి ముందు ఖాళీ జాగా కాదు కదా రోడ్డును కూడా వదలకుండా ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఇక డెడ్ ఎండ్ రోడ్డు అయితే మొత్తం ఆక్రమించేయడం.. ఎదుటి వారికి రహదారి ఉండాలనే ఆలోచన లేకుండా అడ్డంగా నిర్మాణాలు చేసేయడం నగరంలో పరిపాటిగా మారింది. ఈ ఉల్లంఘనలపై నిఘా ఉంచాల్సిన వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ ఇష్టా రాజ్యంగా ఆక్రమణలకు పాల్పడుతున్నారని పలువురు వాపోయారు. పలు సందర్భాల్లో వివిధ శాఖలకు చేసిన ఫిర్యాదుల వివరాలతో వచ్చి.. ఆక్రమణల తీరును వివరించారు. ఈ ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నేరుగా పరిశీలించి.. సంబంధిత అధికారులకు పరిష్కార బాధ్యతలు అప్పగించారు.
రంగారెడ్డి జిల్లా, హయత్‌నగర్ మండలం వనస్థలిపురం సాహేబ్ నగర్లోని శ్రీ వీరాంజనేయ కాలనీలో 18 అడుగుల రహదారిని అక్కడ ప్లాట్లు ఉన్న వారు కబ్జా చేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు. స్పష్టంగా రోడ్డు పక్కన వేసిన కరెంటు స్తంభాలను కూడా కలిపేసి ఫెన్సింగ్ వేసినట్టు ఉన్నా.. స్థానిక అధికారులు చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ విలేజ్‌లోని శ్రీ రాంనగర్ కాలనీలో సర్వే నంబరు 202లో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ 1.20 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేయడమే కాకుండా తమ ఇళ్లకు దారి లేకుండా మూసేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్ మచ్చబొల్లారంలోని సూర్యనగర్ బస్సు స్టాపు వద్ద 30 అడుగుల రోడ్డును 7 అడుగుల వరకూ కబ్జా చేసేశారని.. దీంతో అక్కడ బస్సుల రాకపోకలకు ఇబ్బందిగా పరిణమించిందని బాలాజీ ఎన్‌క్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదుచేశారు.






