ఆవేదన వ్యక్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్
ఆదిలాబాద్ జిల్లా : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కార్ పై భగ్గుమన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు, వార్డు సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు. రైతులు అరిగోస పడుతున్నారని, చేతికొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు కేటీఆర్. బీఆర్ఎస్ పాలనే బాగుండేదని అంటున్నారని అన్నారు. వాళ్లను రాజుల లెక్క చూసుకున్నామని అన్నారు. కానీ మోస పూరితమైన హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు చుక్కలు చూపిస్తోందన్నారు.
కేసీఆర్ హయాంలో వ్యవసాయాన్ని పండుగ లాగా చేశారన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని చెప్పారు. గోదావరి, కృష్ణ నదుల పైన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేశారని అన్నారు కేటీఆర్. కాళేశ్వరం కట్టి బ్రహ్మాండంగా పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును 90% పూర్తి చేశారన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రం పంజాబ్ వంటి రాష్ట్రాలను తలదన్ని దేశంలోనే అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా నిలిచిందన్నారు. అదిలాబాద్ జిల్లాలో కేవలం కొన్ని వేల ఓట్లతో అదిలాబాద్, ఖానాపూర్, కాగజ్ నగర్ వంటి నియోజకవర్గాలు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.






