ప్రకటించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
అమరావతి : ఏపీ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు విద్యుత్ వినియోగదారులకు తీపి కబురు చెప్పారు. విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు ఏపీఈఆర్సీ ప్రభుత్వం ముందు ట్రూ అప్ ప్రతిపాదనలు పెట్టడం జరిగిందన్నారు. సాధారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటే, ట్రూ అప్ ఛార్జీలను పెంచక తప్పని పరిస్థితి కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. కానీ నాడు ప్రతిపక్షంలో ఉండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే, విద్యుత్ ఛార్జీల భారం తగ్గిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు హామీ ఇచ్చారంటూ గుర్తు చేశారు మంత్రి. ఆనాడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఇవాళ సామాన్యులను దృష్టిలో పెట్టుకుని భారం మోప వద్దంటూ నిర్ణయయం తీసుకున్నారని చెప్పారు. వారిపై మరింత ఆర్ధిక భారం మోపడం ఇష్టం లేక చేసిన ప్రతిపాదనలను తిరస్కరించడం జరిగిందన్నారు.
దీంతో డిస్కంల ప్రతిపాదనలను తిరస్కరిస్తూ ఏపీఈఆర్సీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖకు రాశామన్నారు.
2019 లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయే సమయానికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పారు బీసీ జనార్దన్ రెడ్డి. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ అస్తవ్యస్థ విధానాలతో రాష్ట్రంలో విద్యుత్ రంగంలో అనిశ్చిత్తి నెలకొనడంతో పాటు నిత్యం విద్యుత్ కోతలతో ప్రజలు నరకం చవి చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గత 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ బిల్లులు పెంచి రూ. 32 వేల కోట్ల అదనపు భారం ప్రజలపై వేసి సామాన్యుడి నడ్డి విరించిందన్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసి, విద్యుత్ ను ఆదాయ వనరుగా మార్చుకుని తమ జేబులు నింపుకున్న వైసీపీ నేతలు విద్యుత్ రంగానికి మాత్రం రూ. 1.29 లక్షల కోట్లు అప్పులుగా మిగిల్చారని సంచలన ఆరోపణలు చేశారు.






