DEVOTIONAL

మ‌ల్ల‌న్న బ్ర‌హ్మోత్స‌వాల‌కు సిద్దం

Share it with your family & friends

ఏర్పాట్లు చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశం

శ్రీ‌శైలం – శ్రీశైల మహా పుణ్య క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాల‌ని , ఎవ‌రికీ లోటు అన్న‌ది లేకుండా చూడాల‌ని క‌ర్నూలు జిల్లా క‌లెక్ట‌ర్ కె. శ్రీ‌నివాసులు ఆదేశించారు. అన్నపూర్ణ భవనం ప్రక్కన గల సీసీ కంట్రోల్ రూమ్ నందు జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి, దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, దేవస్థానం కార్య నిర్వహణాధికారి డి.పెద్దిరాజుతో కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు.

ఈ సందర్భంగా కె.శ్రీనివాసులు మాట్లాడారు. మార్చి 1 నుండి 11 వరకు 11 రోజులపాటు నిర్వహించే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తేలికగా మల్లన్న దర్శించుకునేలా చూడాల‌న్నారు. ప్ర‌తి ఒక్క భ‌క్తుడు లేదా భ‌క్తురాలు సురక్షితంగా ఇంటికి చేరుకునే వరకు బాధ్యతాయుతంగా మెల‌గాల‌ని స్ప‌ష్టం చేశారు.

ప్రధానంగా క్యూలైన్లు, త్రాగునీటి సదుపాయం, ట్రాఫిక్, వాహనాల పార్కింగ్, నిరంతర విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం తదితర అంశాలపై అప్పగించిన విధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు క‌లెక్ట‌ర్.

కార్య నిర్వహణాధికారి డి. పెద్దిరాజు మాట్లాడుతూ భక్తులకు సులభంగా స్వామి వారి దర్శనం అయ్యేలా నాలుగు రకాల క్యూలైన్లను ఏర్పాటు చేశామని కలెక్టర్‌కు వివరించారు. మార్చి 8వతేదీ మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయంకాలం ప్రభోత్సవం , అనంతరం రాత్రి 10 గంటల నుండి పాగాలంకరణ, లింగోద్భవ కాల మహాన్యాస రుద్రదాభిషేకం, అర్థరాత్రి 12 గంటలకు కల్యాణోత్సవం తదితర వైదిక కార్యక్రమాలన్నీ సంప్రదాయబద్దంగా నిర్వహిస్తామన్నారు .11 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలకు దాదాపు 10 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు