భక్తుల నుండి అభిప్రాయాల సేకరణ కోసం హెల్ప్ లైన్
తిరుపతి : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఈవోగా కొలువు తీరాక టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించారు. కీలక నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు. గతంలో పని చేసిన ఈవోలకంటే భిన్నంగా తనదైన శైలిలో పని చేయడం ప్రారంభించారు. ఎవరూ ఊహించని రీతిలో వైకుంఠ ద్వార దర్శనాలను సామాన్య భక్తులకు కల్పించారు. అంతే కాకుండా 182 గంటలకు గాను 165 గంటలకు కేవలం సామాన్యులకే కేటాయించడం విశేషం. వైద్య పరంగా మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన నిత్యం తనిఖీలు చేస్తూ భక్తుల్లో మరింత విశ్వాసం పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు.
తాజాగా టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణ మండపాల నిర్వహణపై టీటీడీ ఛాంబర్ లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి భక్తుల నుండి ప్రత్యక్షంగా, పరోక్షంగా సలహాలు, సూచనలు తీసుకునేందుకు గాను హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇది వెంటనే జరగాలని స్పష్టం చేశారు అనిల్ కుమార్ సింఘాల్. దేశ వ్యాప్తంగా ఉన్న టిటిడి కళ్యాణ మండపాలలో కాంపౌండ్ వాల్స్, మరుగుదొడ్లు, కళ్యాణ వేదిక, అలంకరణ, వివాహ వేడుకలను నిర్వహించేందుకు అనువుగా ఉన్నాయా, పార్కింగ్ సౌకర్యం, వర్షాకాలంలో లీకేజీలు ఉన్నాయా, కల్యాణ మండపాలలో నీటి నిల్వలు అధికంగా ఉన్నాయా, సెక్యూరిటీ తదితర అంశాలపై అభిప్రాయాలను సేకరించాలని సూచించారు. మరింత మెరుగైన సౌకర్యాల ఏర్పాటు చేయవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి చీఫ్ ఇంజనీర్ టి.వి.సత్యనారాయణ, ఎఫ్ ఏ అండ్ సీఏవో ఓ బాలాజీ తదితర అధికారులు పాల్గొన్నారు.







