మహిళలకు నెలకు 2 వేలు..పురుషులకు ఫ్రీ బస్
చెన్నై : తమిళనాడులో ఎన్నికల కోలాహలం మొదలైంది. అధికారంలో ఉన్న డీఎంకేతో పాటు అన్నాడీఎంకే తో కూడిన ఎన్డీయే, సూపర్ స్టార్ హీరో తళపతి విజయ్ టీవీకేతో పాటు పలు పార్టీలు సిద్దం అయ్యాయి. ఇప్పటికే టీవీకే ఎన్నికల ప్రచార కమిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అన్ని పార్టల కంటే ముందుగా అన్నాడీఎంకే సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు పార్టీ చీఫ్ పార్టీ పరంగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున తాయిలాలు ప్రకటించారు. ప్రత్యేకించి పురుషులు, మహిళల ఓటర్లను ప్రభావితం చేసేలా ఖుష్ కబర్ చెప్పారు. ప్రతి మహిళకు నెలకు రూ. 2 వేలు చొప్పున ఇస్తామన్నారు. అంతే కాకుండా సిటీ బస్సుల్లో ఉచితంగా మహిళలతో పాటు పురుషులకు కూడా బస్సు సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం కొలువుతీరిన డీఎంకే సర్కార్ విడియల్ పయనం పథకం కింద మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించారు. అయితే అన్నా డీంఎకే పురుషులకు కూడా ఈ పథకాన్ని వర్తింప చేస్తామని ప్రకటించడం విశేషం. ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన అనంతరం అన్నాడీఎంకే పార్టీ చీఫ్ ఎడప్పాడి పళని స్వామి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సమ్మిళిత వృద్ధి, సామాజిక న్యాయం , ఆర్థిక భద్రత కల్పించడం తమ ముఖ్య ఉద్దేశమని ప్రకటించారు. ఇందులో భాగంగానే తమ పార్టీ మేనిఫెస్టోను తయారు చేసిందన్నారు. అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం దివంగత ఎంజీ రామచంద్రన్ 109వ జయంతి సందర్బంగా విడుదల చేశామన్నారు.





