కులాల మధ్య కొట్లాటకు కుట్రలకు తెర లేపారు
శ్రీ సత్య సాయి జిల్లా : రాష్ట్రంలో దాడుల పరంపరకు మాజీ సీఎం జగన్ రెడ్డి కారణమని సంచలన ఆరోపణలు చేశారు రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెలి గ్రామంలో ఇద్దరు దళిత యువకులు కత్తులతో ఘర్షణ జరిగి ఒక వ్యక్తి మృతి చెందాడని తెలిపారు. ఈ ఘటన బాధాకరమన్నారు. ఈ ఘటనపై జగన్ శవ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగత జరిగిన ఘర్షణను కులాలకు ఆపాదిస్తూ, కొట్లాటకు జగన్ కుట్ర పన్నుతున్నాడని మండిపడ్డారు. ఆయనకు మొదటి నుంచి శవ రాజకీయాలు చేయడం అలవాటుగా మారిందన్నారు సవిత. తండ్రి శవంతోనే సీఎం కుర్చీ కోసం పాకులాడని ఘనుడని విమర్శించారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలోనూ, పల్నాడు జిల్లాలోనూ రక్తం ఏరులై పారిందన్నారు.
ఎందరో ఎస్సీలను, బీసీలను, టీడీపీ నాయకులను హత్య చేశారన్నారు. బీసీలైన అమర్నాథ్ గౌడ్, తోట చంద్రయ్య హత్య చేయడంతో పాటు మాస్క్ అడిగిన పాపానికి దళిత వైద్యులు సుధాకర్ పై పిచ్చోడు అని ముద్ర వేసి ఏవిధంగా ప్రాణం తీసుకునే ఏవిధంగా వేధించారో ప్రజలందరికీ తెలుసన్నారు. దళిత డ్రైవర్ ను చంపిన డోర్ డెలివరీ చేసిన ఘటనలను ఎవరూ మరిచి పోలేదన్నారు. రప్పా…రప్పా… నరుకుతామంటూ జగన్ సహా వైసీపీ పెద్దలు బహిరంగంగానే అంటుండడంతో ఆ పార్టీ గూండాలు రెచ్చి పోతున్నారు. రాష్ట్రమంతటా సంక్రాంతి సంబరాలు జరుగుతుంటే, జగన్ ప్రోద్బలంతో వైసీపీ గూండాలు కత్తులతో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారు. గత రెండు మూడ్రోజుల నుంచి రాష్ట్రంలో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనమన్నారు. తుని నియోజక వర్గం కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, బీసీ నేత లాలం బంగారయ్యను అతి కిరాతకంగా హత్య చేశారన్నారు.






