నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ పాలిట శాపంగా మారాడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ద్రోహిగా ఇప్పటికే ముద్ర వేసుకున్నాడని అన్నారు. చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ధ్వజమత్తారు. పాలన చేతకాక తమ నాయకుడు కేసీఆర్ పై అనుచిత కామెంట్స్ చేస్తున్నాడని, ఇది తన స్థాయికి తగదన్నారు. చీకటి స్నేహాలు చేస్తూ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వంచిస్తున్న కాంగ్రెస్ ద్రోహి రేవంత్ రెడ్డి అని ఆరోపించారు హరీశ్ రావు. పగలు రాహుల్ గాంధీ జపం చేయడం రాత్రయితే బీజేపీ, టీడీపీలతో దోస్తీ కట్టడం పరిపాటిగా మారిందన్నారు.
కాంగ్రెస్ సిద్ధాంతాలకు తూట్లు పొడుస్తూ కమలం చెంతన, కమలానికి కాపు కాస్తున్న బాబు చెంతన చేరడం రేవంత్ ద్రోహబుద్ధికి పరాకాష్ట అన్నారు హరీశ్ రావు. సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంలో చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ముమ్మాటికీ రేవంత్ రెడ్డిది ద్రోహ చరిత్ర.. అడుగడుగునా వెన్నుపోట్లు. అనుక్షణం అబద్ధాలు.. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమే ద్రోహాల పుట్ట అని ఆరోపించారు. ద్రోహ బుద్ధి అనేది రేవంత్ రెడ్డి డీఎన్ఏలోనే ఉందన్నారు హరీశ్ రావు. సమైక్యవాదుల కొమ్ముకాస్తూ, స్వరాష్ట్ర కాంక్షతో పోరాడిన ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి అని భగ్గుమన్నారు. చంద్రబాబు తరపున ఎమ్మెల్యేలను కొనేందుకు నోట్ల బ్యాగులు మోస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ‘ఓటుకు నోటు’ దొంగ, ప్రజాస్వామ్య ద్రోహి రేవంత్ అని మండిపడ్డారు.





