రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై సీరియస్ కామెంట్స్
న్యూఢిల్లీ : ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా నిప్పులు చెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరిన రేవంత్ రెడ్డి సర్కార్ అనుసరిస్తున్న తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అధికారికంగా సంస్థ కీలక ప్రకటన చేసింది. ఎన్టీవీలో వచ్చిన కథనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జర్నలిస్టులను అరెస్ట్ చేయడం, ఇతర యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోయిందని మండిపడింది. ఇది మంచి పద్దతి కాదని తెలిపింది. ఒకవేళ వ్యక్తిగతంగా లేదా ఇతరత్రా ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందని భావిస్తే దానికి కోర్టులు , చట్టాలు అనేవి ఉన్నాయని తెలిపింది.
అలా కాకుండా ఎలా పడితే అలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామని అనుకుంటే ఎలా అని ప్రశ్నించింది. ఈ ఘటనలో ఎన్టీవీ జర్నలిస్టులపై తొందర తొందరగా చర్యలు తీసుకొని, మీడియాను అపకీర్తి చేయడాన్ని మేము ఖండిస్తున్నాం అని స్పష్టం చేసింది ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా. అరెస్టులు చేసే కంటే ముందుగా, పోలీసులు న్యాయ ప్రక్రియను అనుసరించి, సమగ్ర దర్యాప్తు జరపాల్సి ఉండేదని పేర్కొంది. తెలంగాణలో మీడియా స్వేచ్ఛగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా పనిచేసేలా ప్రభుత్వం చూడాలని, ఆ బాధ్యత తనపై ఉందని స్పష్టం చేసింది . అలాగే మీడియాతో వ్యవహరించేటప్పుడు న్యాయ ప్రక్రియను పాటించి, సంయమనం వహించాలని అధికారులకు సూచించింది ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా.





