విద్యార్థులకు అదనంగా 1080 మందికి హాస్టల్ సీట్లు
తిరుపతి : టీటీడీ విద్యా సంస్థలపై ఫోకస్ పెట్టారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. టిటిడి ఎస్వీ విద్యాదానం ట్రస్ట్ పై సమీక్ష నిర్వహించారు. టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఈవో మాట్లాడుతూ, టిటిడి కళాశాలలు, పాఠశాలలలో ఆధునిక వసతులు, అదనపు వసతి, అదనపు తరగతి గదులు, మినీ సమావేశ మందిరం తదితర మౌళిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మౌళిక సదుపాయాలపై టిటిడి పాలక మండలి సబ్ కమిటి 22 రెకమెండేషన్ లను ఇచ్చిందని, వాటిని అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. టిటిడి కళాశాలలు, పాఠశాలల్లో మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే విడుదలైన నిధులు మినహా మిగిలిన నిధుల అనుమతుల కోసం పాలక మండలి దృష్టికి తీసుకు రావాలన్నారు.
టిటిడి తాజా మౌలిక సదుపాయాల మూలంగా టిటిడి కళాశాలల్లో బాల బాలికలకు అదనంగా 1080 మందికి వసతి సౌకర్యం కల్పించే అవకాశం ఉంటుందన్నారు. టిటిడి విద్యా సంస్థలలో డిజిటలైజేషన్ , ఇంట్రాక్టివ్ ప్యానల్ బోర్డులు, కంప్యూటర్లు, ప్రింటర్స్, నెట్ వర్కింగ్ మెటిరియల్, సిసి కెమెరాలు, మొబైల్ మెడికల్ యూనిట్ , తరగతి గదులు, మరుగుదొడ్లు, భోజన శాల, వంట గదులు, వేడి నీరు, సివిల్ పనులు, తదితర అంశాలపై ఈవో సమీక్ష నిర్వహించారు. సదరు అంశాలపై టిటిడి జేఈవో, టిటిడి సీఈ ప్రత్యక్షంగా పర్యవేక్షించి నివేదిక సమర్పించాలని సూచించారు.
ఈ సమావేశంలో టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం, ఎఫ్‌ఏ అండ్ సీఏవో బాలాజీ, సీఈ టి.వి. సత్యనారాయణ, డిఈవో వెంకట సునీలు తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.






