స్కూళ్లు, కాలేజీలకు సర్కార్ సెలవు డిక్లేర్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బుధవారం మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు టీడీపీ, బీజేపీ, సీపీఎం, జనసేన, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. అర్హత ఉన్న ప్రతి ఓటరుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పాల్గొనే అవకాశం లభించేలా ఓటింగ్ జరిగే మున్సిపల్ ప్రాంతాల్లో స్థానిక సెలవు ప్రకటించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎక్కువ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, పౌరులకు ఓటింగ్ అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేసింది.
పోలింగ్ ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, సహకార సంస్థలు,ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ సెలవు వర్తిస్తుంది. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పరిపాలనా వ్యవస్థ పూర్తిగా మద్దతు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా అనేక విద్యా సంస్థలు పోలింగ్ కేంద్రాలుగా ఉపయోగించ బడుతున్నందున, ఫిబ్రవరి 11న , ప్రైవేట్ పాఠశాలలు, అలాగే కళాశాలలు రెండూ మూసి వేస్తారు. ఈ భవనాలను ముందుగానే స్వాధీనం చేసుకుని, ఓటింగ్ ప్రక్రియకు అవసరమైన అన్ని సన్నాహాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.






